అనకాపల్లి జిల్లా, మాడుగుల మండలం, ఒమ్మలి,ఒమ్మలి జగన్నాధపురం, మోక్ష కృష్ణాపురం గ్రామల పరిధిలో ఈ పరిసరాల్లో ఉన్న పురాతన హరిహర క్షేత్రం నేడు శిథిలావస్థలో కనిపిస్తున్నప్పటికీ, అక్కడ కనిపిస్తున్న భారీ రాతి వంతెన శిధిలాలు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఆలయానికి వెళ్లేందుకు కనీస రహదారి కూడా లేకపోయినా, ఒకప్పుడు సుమారు 15 అడుగుల వెడల్పు గల మార్గం ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
కూలిపోయిన భారీ రాతి నిర్మాణాలను పరిశీలిస్తే, ఇవి సాధారణ దారి కోసం నిర్మించినవి కాదనే అభిప్రాయం కలుగుతోంది. ఆ కాలంలో ఆధునిక యంత్రాలు లేకుండానే ఇంత భారీ రాళ్లను ఎలా తీసుకువచ్చారు? రోడ్డు సౌకర్యాలు లేకపోయినప్పుడు ఈ వంతెనను ఎలా నిర్మించారు? అనే ప్రశ్నలు స్థానికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాంతం పూర్తిగా పొదలు, చెట్లతో కప్పబడి ఉంది. ఒకప్పుడు భక్తులు, గ్రామస్తులు సంచరించిన మార్గం కాలగర్భంలో కలిసిపోయింది. అయినప్పటికీ, మిగిలి ఉన్న ఈ వంతెన శిధిలాలు గత వైభవానికి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
స్థానిక చరిత్రపై ఆసక్తి ఉన్నవారు, పురావస్తు పరిశోధకులు ఈ ప్రాంతాన్ని సమగ్రంగా పరిశీలిస్తే, హరిహర క్షేత్ర చరిత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
హరిహర క్షేత్రంలోని పురాతన మండపంలో శ్రీకృష్ణుడి విగ్రహం కింద భూమిలోనే ఉన్న శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హరి (శ్రీమహావిష్ణువు) – హర (పరమశివుడు) ఆరాధనకు ప్రతీకగా భావించే ఈ అరుదైన నిర్మాణం, క్షేత్రం ప్రత్యేకతను చాటుతోంది. ప్రస్తుతం శివలింగం పాక్షికంగా భూమిలోనే ఉండిపోవడం, ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం ఈ క్షేత్ర గత వైభవాన్ని గుర్తు చేస్తోంది. ఈ ప్రాచీన నిర్మాణాన్ని సంరక్షించి, శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News https://madugula9news.blogspot.com
0 కామెంట్లు