ఒక్కటిగా నిలిచే గ్రామం.. ఒమ్మలి జగన్నాధపురం



కలిసి ఉండటం.. కలిసి పనిచేయడం.. కలిసి సమస్యను పరిష్కరించుకోవడం.. ఇదే ఒమ్మలి జగన్నాధపురం అసలైన బలం.

అనకాపల్లి : మాడుగుల మండలంలో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన పల్లె వాతావరణంతో పాటు గ్రామస్తుల ఐక్యతకు ప్రత్యేక గుర్తింపు పొందుతోంది ఒమ్మలి జగన్నాధపురం. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి ఒకే మాటపై నిలబడటం ఈ గ్రామం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత సమస్యలను కూడా గ్రామ సమస్యగానే భావించి, పెద్దల సమక్షంలో చర్చించుకుని పరిష్కరించుకునే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.

ఎవరైనా తమ సమస్యను, బాధను గ్రామ పెద్దల దృష్టికి తీసుకురావాలంటే ప్రజలను ఇంటికి రప్పించుకుని తీర్పు చెప్పించుకోవడం ఇక్కడి ఆనవాయితీ కాదు. చిన్న సమస్య అయినా, ఎంత పెద్ద తగువు అయినా గ్రామంలోని రచ్చబండ వద్దకే వచ్చి అందరి సమక్షంలో విషయాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఇరువర్గాల మాటలు విన్న అనంతరం గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలోనే చర్చించి పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. దీంతో రచ్చబండ ఈ గ్రామంలో కేవలం ఒక ప్రదేశంగా కాకుండా గ్రామ ప్రజల మధ్య ఐక్యతకు, పరస్పర అవగాహనకు వేదికగా నిలుస్తోంది.

గ్రామంలోని ఆలయాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఏ ఆలయంలో పండగ లేదా ప్రత్యేక కార్యక్రమం జరిగినా అది కొందరి కార్యక్రమంగా కాకుండా ఊరంతా కలిసి నిర్వహించే కార్యక్రమంగా భావిస్తారు. గ్రామస్తులంతా తమవంతు సహకారం అందిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేస్తారు. అంతేకాకుండా కార్యక్రమం పూర్తయిన మరుసటి రోజు నుంచి మూడో రోజు లోపల గ్రామ పెద్దల సమక్షంలో రచ్చబండ వద్దే కార్యక్రమానికి సంబంధించిన ఆదాయ, ఖర్చుల లెక్కలను గ్రామ ప్రజలకు తెలియజేయడం ఇక్కడి మరో ప్రత్యేకత.

ఊరంతా కలిసి నిలబడటం.. సమస్యను అందరి ముందే మాట్లాడుకోవడం.. కార్యక్రమాన్ని అందరూ కలిసి నిర్వహించడం.. లెక్కలను కూడా ప్రజల సమక్షంలో వెల్లడించడం.. ఇవే ఒమ్మలి జగన్నాధపురం గ్రామానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి. మారుతున్న కాలంలోనూ రచ్చబండ కేంద్రంగా కొనసాగుతున్న ఈ ఐక్యతా సంప్రదాయం గ్రామ సంస్కృతికి ప్రత్యేకతను చాటుతోంది.

మరిన్ని స్థానిక వార్తల కోసం: Madugula 9 News ఫాలో అవ్వండి. https://madugula9news.blogspot.com⁠

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు